4
క్రీస్తు మంచి సేవకుని ప్రవర్తన 
 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.  2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది.  3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు. 
 4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు.  5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.  6 ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు. 
 7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో.  8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది. 
 9 ఈ సందేశం విశ్వసనీయమైనదీ పూర్తిగా అంగీకరించదగినదీ.  10 మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం. 
 11 ఈ సంగతులు ఆదేశించి నేర్పు.  12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు.  13 నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.  14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు. 
 15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి.  16 నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.