2
ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ 
 1  “ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. 
తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే,  2  నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.  3  ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసి పోలేదనీ నాకు తెలుసు. 
 4  అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు.  5  కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను.  6  అయితే నీలో ఈ విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే. 
 7  మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.” 
స్ముర్నలో ఉన్న సంఘానికి లేఖ 
 8  “స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. 
మొదటివాడూ చివరివాడూ చనిపోయి తిరిగి బతికిన వాడు చెబుతున్నదేమిటంటే,  9  నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు.  10  నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. 
 11  చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.” 
పెర్గములో ఉన్న సంఘానికి లేఖ 
 12  “పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. 
రెండు వైపులా పదునున్న కత్తి కలవాడు చెబుతున్న సంగతులు.  13  నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు. 
 14  అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు.  15  అలాగే నికొలాయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో ఉన్నారు.  16  కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను. 
 17  మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.” 
తుయతైరలో ఉన్న సంఘానికి లేఖ 
 18  “తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాటి కళ్ళూ, మెరుస్తున్న కంచు లాంటి పాదాలూ ఉన్న దైవ పుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే,  19  నీ పనులూ నీ ప్రేమా నీ విశ్వాసమూ నీ సేవా నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు. 
 20  అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది.  21  పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు.  22  ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను.  23  ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను. 
 24  అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ‘ఇక మరే భారమూ మీ మీద పెట్టను’ అని చెబుతున్నాను.  25  నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి.  26  జయిస్తూ, నా పనులను చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను.  27  అతడు ఇనప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు.  28  తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను. 
 29  మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”