32
దావీదు కీర్తన. 
 1 పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. 
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు. 
 2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. 
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించని వాడు ధన్యుడు. 
 3 దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను. 
కానీ నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. 
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను. 
 4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు. 
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను. 
 5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. 
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. 
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. 
మరియు నీవు నా పాపాలను క్షమించావు. 
 6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. 
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చి నాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి. 
 7 దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. 
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. 
నీవు నన్ను ఆవరించి, కాపాడుము. 
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను. 
 8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం 
గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. 
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను. 
 9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము. 
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి. నీవు కళ్లెంను వారు ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.” 
 10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి. 
కానీ యెహోవాను నమ్ముకొనే వారిని ప్రేమ ఆవరిస్తుంది. 
 11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి. 
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.