96
 1 యెహోవా చేసిన కొత్త కార్యాలను గూర్చి ఒక కొత్త కీర్తన పాడుడి! 
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక! 
 2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి. 
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి. 
 3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి. 
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి. 
 4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. 
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు. 
 5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే. 
కానీ యెహోవా ఆకాశాలను సృష్టించాడు. 
 6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. 
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి. 
 7 వంశములారా రాజ్యములారా యెహోవా మహిమకు, 
స్తుతి కీర్తనలు పాడండి. 
 8 యెహోవా నామాన్ని స్తుతించండి. 
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి. 
 9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి! 
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి. 
 10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! 
కనుక ప్రపంచం నాశనం చేయబడదు. 
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు. 
 11 ఆకాశములారా సంతోషించండి! భూమీ, ఆనందించుము! 
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము! 
 12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి! 
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి. 
 13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి. 
ప్రపంచాన్ని పాలించుటకు* ప్రపంచాన్ని పాలించుటకు పాలించుట లేదా న్యాయం తీర్చుట. యెహోవా వస్తున్నాడు. 
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.