5
ఇశ్రాయేలు కొరకు విషాద గీతిక 
 1 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే. 
 2 ఇశ్రాయేలు కన్యక పతనమయింది. 
ఆమె ఇక లేవలేదు. 
మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది. 
ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు. 
 3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
“వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే 
అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు 
వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే 
అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.” 
తనవద్దకు తిరిగి రమ్మని ఇశ్రాయేలును యెహోవా ప్రోత్సహించుట. 
 4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి. 
 5 కాని బేతేలులో వెదకవద్దు. 
గిల్గాలుకు వెళ్లవద్దు. 
సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి. 
గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకు పోబడతారు. 
బేతేలు నాశనం చేయబడుతుంది. 
 6 యెహోవా దరిచేరి జీవించండి. 
మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పదివంశాలవారు) ఇంటిమీద నీప్పు పడుతుంది. 
ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరు ఆపలేరు. 
 7-9 మీరు యెహోవా కొరకు చూడండి. 
సప్త ఋషీ నక్షత్రములను మృగశిర నక్షత్రాన్ని సృష్టించినది ఆయనే. 
చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు. 
పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు. 
ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు. 
ఆయన పేరు యహోవా! 
ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు. 
మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.” 
ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు 
ప్రజలారా ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు. 
న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు. 
 10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి ప్రజలు చేసే చెడ్డ పనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచే ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు. 
ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు. 
 11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు. 
మీరు పేదవారి నుండి గోధుమ మోపులను తీసుకుంటారు. 
ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు. 
కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు. 
మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటతారు. 
కాని మీరు వాటి నుండి ద్రాక్షారసం తాగరు. 
 12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాల గురించి నాకు తెలుసు. 
మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు. 
మంచి పనులు చేసే ప్రజలను మీరు బాధించారు. 
చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు. 
బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు. 
 13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు. 
ఎందుకంటే అది చెడు కాలం గనుక. 
 14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు. 
అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు. 
అప్పుడు మీరు బతుకుతారు. 
సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు. 
 15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు. 
న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధ రించండి. 
అప్పుడు యోసేపు వంశంలో మిగిలిన వారిమీద దేవుడు, 
సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు. 
మిక్కిలి దుఃఖకాలం రాబోవుట 
 16 అందువలన నా ప్రభువును, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు: 
“బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలిపిస్తారు. 
ప్రజలు వీధులలో రోదిస్తారు. 
ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు. 
 17 ద్రాక్షా తోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు. 
ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” 
యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 
 18 మీలో కొంతమంది 
యెహోవా యొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరతారు. 
అ రోజున మీరెందుకు చూడగోరుతున్నారు. 
యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు! 
 19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై 
ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు! 
ఇంటిలోకి వెళ్లి గోడమీద చేయి వేయగా 
పాము కరచిన వాని మాదిరి మీరుంటారు! 
 20 కావున యెహోవా యొక్క ప్రత్యేక దినము 
చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయంగాదు! 
ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది. 
ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం 
 21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను! 
నేను వాటిని అంగీకరించను! 
మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను! 
 22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా, 
నేను వాటిని స్వీకరించను! 
మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు 
నేను కనీసం చూడనైనా చూడను. 
 23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడ నుండి తొలగించండి. 
మీ స్వరమండలము నుండి వచ్చే సంగీతాన్ని నేను వినను. 
 24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి. 
మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి. 
 25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాల పాటు 
నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు. 
 26 కాని మీరు మీ రాజు యొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను* కైవాను ఇవి అష్షూరు దేవుళ్ల పేరు. విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు. 
పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు. 
 27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.” 
దేవుడును, సర్వశక్తిమంతుడు 
అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.