21
 1 అందువల్ల యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు:  2 “నరపుత్రుడా, యెరూషలేము వైపు చూసి, వారి పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడు. నా తరపున ఇశ్రాయేలు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడు.  3 ఇశ్రాయేలు రాజ్యానికిలా తెలియజేయి, ‘యెహోవా ఈ విషయాలు చెప్పాడు, నేను నీకు వ్యతిరేకంగా వున్నాను! ఒరలోనుండి నా కత్తిని దూస్తాను. నీనుండి ప్రజలందరినీ తొలగిస్తాను. వారిలో మంచివారు, చెడవారు అంతా ఉంటారు!  4 నీ మంచి మనుష్యులనూ, చెడ్డవారినీ నేను నాశనం చేస్తాను. ఒరనుండి నా కత్తిని దూస్తాను. దక్షిణాన్నుండి ఉత్తరం వరకు గల ప్రజలందరిపై దానిని ప్రయోగిస్తాను.  5 అప్పుడు ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకొంటారు. పైగా నా కత్తిని ఒరనుండి దూశానని కూడా వారు తెలుసుకొంటారు. తన పని పూర్తి చేసే వరకు నా కత్తి మళ్లీ ఒరలోకి తిరిగి వెళ్లదు.’ ” 
 6 దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, గుండె పగిలే దుఃఖంలో వున్న వ్యక్తిలా నీవు నిట్టూర్పులు విడువు. ప్రజల ముందే నిట్టూర్పు.  7 వారప్పుడు నిన్ను, ‘నీ వెందుకు నిట్టూరుస్తున్నావు?’ అని అడుగుతారు. దానికి నీవు ఇలా సమాదానం చెప్పాలి, ‘రాబోయే విషాద వార్తను తలచుకొని భయంతో ప్రతి హృదయం వికలమైపోతుంది. చేతులు బలహీనమవు తాయి. ప్రతి ప్రాణం నీరసించి పోతుంది. మోకాళ్ళు నీళ్లవలె మారిపోతాయి.’ చూడండి; ఆ చెడ్డవార్త రాబోతూ ఉంది. ఈ విషయాలన్నీ జరుగుతాయి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 
ఖడ్గం సిద్ధంగా ఉంది 
 8 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడ:  9 “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు తెలియజెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు: 
“ ‘చూడండి, ఒక కత్తి, 
పదును గల కత్తి మెరుగుదిద్దిన కత్తి. 
 10 చంపటానికి పదును పెట్టబడింది కత్తి. 
మెరుపులా మెరవటానికి అది మెరుగుదిద్దబడింది. 
నా కుమారా, నిన్ను శిక్షించటానికి నేను వాడే కర్రకు నీవు దూరంగా పారిపోయావు. 
ఆ కట్టెపుల్లతో శిక్షింపబడటానికి నీవు నిరాకరించావు. 
 11 అందువల్ల కత్తి మెరుగు పెట్టబడింది. 
ఇప్పుడది వాడబడుతుంది. 
కత్తి పదును పెట్టబడి, మెరుగుదిద్దబడింది. 
అదిప్పుడు చంపేవాని చేతికి ఇవ్వ బడుతుంది. 
 12 “ ‘నరపుత్రుడా, కేకలు పెట్టి రోదించు! ఎందుకంటే ఆ కత్తి నా ప్రజల మీదికి, ఇశ్రాయేలు పాలకుల మీదికి తేబడింది! ఆ పాలకులు యుద్ధాన్ని కోరారు. అందవల్ల కత్తి ఎదురైనప్పుడు వారు నా ప్రజలతో పాటు వుంటారు! కావుల నీ తొడ చరుచుకొని, నీ దుఃఖాన్ని వెలిబుచ్చే పెద్ద శబ్దాలు చేయుము!  13 ఎందు వల్లనంటే, ఇది కేవలం పరీక్ష గాదు! నీవు కట్టెతో శిక్షింపబడటానికి నిరాకరించావు. కనుక నిన్ను శిక్షించటానికి మరి నేనేమి ఉపయోగించాలి? అవును. కత్తినే!’ ” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 
 14 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు చప్పట్లు చరిచి, నా తరపున ప్రజలతో మాట్లాడు. 
“కత్తిని రెండుసార్లు కిందికి రానీ, అవును, మూడుసార్లు! 
ఈ కత్తి ప్రజలను హతమార్చటానికే. 
మహా మారణానికి వినియోగించబడేది ఈ ఖడ్గమే! 
ఈ కత్తి వాళ్లను ఖండిస్తుంది. 
 15 భయంతో వారి హృదయాలు కరుగుతాయి. 
చాలామంది పడిపోతారు. 
వారి నగర ద్వారం వద్దనే చంపబడతారు. 
అవును. ప్రజలను చంపటానికి ఆ ఖడ్గాన్ని నేనే ఎంపిక చేశాను! 
ఆ ఖడ్గం మెరుపుతీగలా ప్రకాశిస్తుంది. 
 16 ఓ ఖడ్గమా, పదునుగా నుండుము, 
కుడి పక్క నరుకు. 
ఎడమ పక్క నరుకు. 
నీ అంచు ఎటు వెళ్లగోరితే అటు వెళ్లు! 
 17 “అప్పుడు నేను కూడా చప్పట్లు చరుస్తాను. 
పిమ్మట నా కోపాన్ని చూపడం ఆపుతాను. 
యెహోవానైన నేను మాట్లాడాను!” 
యెరూషలేముకు మార్గాన్ని ఎంపిక చేయటం 
 18 యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:  19 “నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గం ఇశ్రాయేలుపై రావటానికి వినియోగపడే రెండు మార్గాలను గీయుము. రెండు మార్గాలూ ఒకే ప్రదేశం బబులోను నుండి మొదలవ్వాలి. నగరానికి వచ్చే ఒక మార్గం మొదట్లో ఒక గుర్తు పెట్టి.  20 ఖడ్గం ఏ దారిని వినియోగిస్తుందో తెలుపటానికి ఆగుర్తు పెట్టాలి. ఒక మార్గం అమ్మెనీయుల నగరమైన రబ్బాకు వెళ్తుంది. మరొక మార్గం యూదాలోని రక్షిత నగరమైన యెరూషలేముకు వెళ్తుంది!  21 ఇది బబులోను రాజు ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు కార్జంవెపు చూశాడు. 
 22 “అక్కడ అతను కొన్ని సంకేతాలు చూశాడు. అవి అతనిని తన కుడిపక్కనున్న యెరూషలేముకు పోయే మార్గంలో వెళ్లమని సూచించాయి! అతడు నగర ద్వారాలు పగులగొట్టే దూలాల యంత్రాలను తేవటానికి సిద్ధం కమ్మనే సంకేతం ఇవ్వాలను కున్నాడు. అతడు ఆజ్ఞ ఇవ్వగానే అతని సైనికులు మారణకాండకు పూనుకుంటారు. యుద్ధ నినాదాలు చేయమని, నగరపు గోడకు మురికి వీధిని నిర్మించమని, మరియు కొయ్య బురుజులు నగరాన్ని ఎదుర్కోవడానికి నిర్మించమని సంకేతాలు యిస్తాడు.  23 ఆ తంత్ర సంకేతాలు ఇశ్రాయేలు ప్రజలకు అర్థంకావు. వారు చేసిన వాగ్దానాలు వారికున్నాయి. అవి వారికి ముఖ్యం. కాని యెహోవా వారి పాపాలను జ్ఞాపకం పెట్టు కుంటాడు. దానితో ఇశ్రాయేలీయులు పట్టుబడతారు.” 
 24 నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెప్పాడు: “మీరు అనేక చెడు కార్యాలు చేశారు. మీ పాపాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. మీరు నేరస్థులని గుర్తుపెట్టుకొనేలా మీరు నన్ను ఒత్తిడి చేశారు. కావున శత్రువు మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు.  25 ఓ ఇశ్రాయేలు దుష్ట నాయకుడా, నీవు చంపబడతావు. నీకు శిక్ష కాలం సమీపించింది! నీ అంతం ఇక్కడే!” 
 26 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ తలపాగా తీసివేయి! నీ కిరీటం తీసివేయి! మార్పుకు సమయం ఆసన్నమయ్యింది. ముఖ్య నాయకులు తగ్గింపబడతారు. సామాన్య మానవులు ప్రముఖ వ్యక్తులౌతారు.  27 ఆ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను! కాని యోగ్యుడైన వ్యక్తి కొత్త రాజు అయ్యేవరకు ఇది సంభవించదు. అప్పుడు ఈ నగరాన్ని అతడు (బబులోను రాజు) కైవసం చేసుకొనేలా చేస్తాను.” 
అమ్మెనుకు వ్యతిరేకంగా ప్రవచనం 
 28 దేవుడు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: ‘అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
“ ‘చూడండి, ఒక ఖడ్గం! 
ఆ ఖడ్గం దాని ఒరనుండి బయటకు వచ్చింది. 
కత్తి మెరుగు దిద్దబడింది! 
కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది. 
అది మెరుపు తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది! 
 29 “ ‘మీ దర్శనాలు పనికిరావు. 
మీ మంత్ర తంత్రాలు సహాయపడవు. 
అదంతా ఒక అబద్ధాల మూట. 
దుష్టుల మెడల మీద ఇప్పుడు కత్తి ఉంది. 
వారు త్వరలో శవాలై పోతారు. 
వారికి సమయం దాపురించింది. 
వారి చెడుతనం ముగిసే సమయం వచ్చింది. 
బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 
 30 “ ‘ఇప్పుడు కత్తిని దాని ఒరలో పెట్టవచ్చు. నీవు సృష్టింపబడిన ప్రదేశంలో, నీవు జన్మమెత్తిన రాజ్యంలో నీకు నేను న్యాయనిర్ణయం చేస్తాను.  31 నీ మీగ నా కోపాన్ని కుమ్మరిస్తాను. వేడి గాడ్పువలె నా కోపం నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను దుష్టులయిన మగవారికి అప్పగిస్తాను. వారు ప్రజల్ని హత మార్చటంలో ఆరితేరిన వారు.  32 నీవు అగ్నికి ఆజ్యంలా తయారవుతావు. నీ రక్తం భూమిలోకి లోతుగా ప్రవహిస్తుంది. ప్రజలు నిన్ను మరెన్నడూ జ్ఞాపకం పెట్టుకోరు. యెహోవానైన నేనే ఇది చెప్పాను.’ ”