17
సిరియాకు దేవుని సందేశం 
 1 ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు: 
“దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమస్కు నాశనం చేయబడుతుంది. 
దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి. 
 2 ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు. 
ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి. 
వాటిని పట్టించుకొనే వాడు ఎవ్వడూ ఉండడు. 
 3 ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి. 
దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది. 
ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.” 
ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు. 
 4 ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఐశ్వర్యం అంతాపోతుంది. 
వ్యాధి మూలంగా చాలా బరువు తగ్గిపోయినమని షిలా యాకోబు ఉంటాడు. 
 5 ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు. 
 6 ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే సమయంలో ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్లకొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని పై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు. 
 7 ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివైపు చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని చూస్తారు.  8 ప్రజలు, వారు చేసిన గొప్ప వాటిని నమ్ముకోరు. అబద్ధపు దేవుళ్ల కోసం వారు తయారు చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు.  9 ఆ కాలంలో కోటలుగల పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ ఖాళీగా ఉంటుంది.  10 మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు. 
చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి ద్రాక్షా వల్లులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు ఎదగవు.  11 ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది. 
 12 ఎంతెంతో మంది ప్రజలు చెప్పేది విను. 
సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఘోషవిను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా ఉండి. 
సముద్రంలో అలలూ అలలూ ఢీకొన్న ఘోషలా ఉంది. 
 13 ప్రజలు ఆ అలల్లా ఉంటారు. 
దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. 
ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు. 
గాలి విసురుతుంది కలుపు కొట్టుకొని పోతుంది. 
 14 ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. 
తెల్లవారే సరికి ఏమీ మిగలదు. 
కనుక మన శత్రువులకు ఏమీ లభించదు. 
వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.