౨
 ౧ మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి. 
మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి. 
 ౨ మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు. 
వ్యాజ్యం వెయ్యి. 
ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను. 
ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి. 
తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి. 
 ౩ లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. 
ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను. 
ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను. 
దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను. 
 ౪ ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు. 
 ౫ వారి తల్లి కులట. 
వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. 
ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది. 
 ౬ కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను. 
దానికి దారి కనబడకుండా గోడ కడతాను. 
 ౭ అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది. 
ఎంత వెతికినా వారు దానికి కనబడరు. 
అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.” 
 ౮ దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. 
వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు. 
 ౯ కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను. 
ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని, జనపనార లాగేసుకుంటాను. 
 ౧౦ దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. 
నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు. 
 ౧౧ ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను. 
ఆమె పండగలూ అమావాస్య పర్వదినాలూ విశ్రాంతి దినాలూ వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను. 
 ౧౨  “ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను. 
 ౧౩ అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. 
ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు, 
నగలు పెట్టుకుని, సింగారించుకుని, 
నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. 
ఇది యెహోవా వాక్కు. 
 ౧౪ ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. 
అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను. 
 ౧౫ ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. 
ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. 
పసిప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది. 
 ౧౬  “ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. 
‘నా భర్త’ అంటావు.” 
 ౧౭ ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు. 
 ౧౮  “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, 
పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. 
దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. 
వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను. 
 ౧౯ నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. 
నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. 
 ౨౦ యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. 
 ౨౧ ఆ దినాన నేను జవాబిస్తాను.” 
ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి. 
 ౨౨ భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా, 
అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి. 
 ౨౩ నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. 
లో రుహమా పై నేను జాలి పడతాను. 
నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, 
వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.