ఇశ్రాయేలుకు హెచ్చరిక
3
ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. “భూమి మీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
ఇశ్రాయేలు శిక్షకు కారణం
అంగీకారం లేకుండా
ఇద్దరు వ్యక్తులు కలిసినడవలేరు.
అడ విలో వున్న సింహం ఒక జంతువును
పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
బోనుమూసూకుపోతే, అది అందులో చిక్కుతుంది.
హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
9-10 అష్టోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్తితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”
11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”
12 యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు.
ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు.
సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని,
చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు.
అదే మాదరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు.
సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలను గాని,
లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కను గాని రక్షించుకుంటారు.”
13 నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను గూర్చి హెచ్చరించు. 14 ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులో వున్న బలిపీఠాలను కూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద బడతాయి. 15 శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలపి నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయబడతాయి. అనేక ఇండు నాశనం చేయబడతాయి.” యెహోవా ఆ విషయాలు చేప్పాడు.