11
1 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవై ఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను.
2 పిమ్మట దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ నగరానికి కీడు మూడే పథకాలు వేసేవారు వీరే. ప్రజలు చెడు కార్యాలు చేయటానికి వీరు నిత్యం ప్రోత్సహిస్తారు.
3 ఈ మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు.
4 వారీ అబద్ధాలు చెపుతున్నారు. కావున నీవు నా తరపున ప్రజలతో మాట్లాడాలి. ఓ నరపుత్రుడా, నీవు వెళ్లి ప్రజలకు భవిష్యత్తు యొక్క నిజాలను ప్రకటించు.”
5 ఆ తరువాత యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది. దేవుడు ఇలా చెప్పాడు: “యెహోవా ఈ మాట చెప్పాడని వారికి తెలియజేయి: ఇశ్రాయేలు వంశీయులారా, మీరు పెద్ద పెద్ద విషయాలు చేయపూనుకొంటున్నారు. కాని మీరు ఏమి ఆలో చిస్తున్నారో నాకు తెలుసు!
6 మీరీ నగరంలో అనేక మందిని చంపివేశారు. వీధులన్నిటినీ మీరు శవాలతో నింపివేశారు.
7 ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి ఈ సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు!
8 మీరు కత్తికి భయపడుతున్నారు. కాని మీ మీదికి నేను కత్తిని తీసుకువస్తున్నాను!’” మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కావున అవి నెరవేరితీరుతాయి!
9 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని శిక్షిస్తాను!
10 మీరు కత్తికి గురియై చనిపోతారు. నేను మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. తద్వారా మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకొంటారు. నేనే యెహోవాను.
11 అవును. ఈ నగరం వంటపాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం! మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను.
12 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు భగ్నపర్చింది నా ధర్మాన్నే! మీరు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. మీ చుట్టూ వున్న దేశాల ప్రజల మాదిరిగానే మీరూ జీవించటానికి నిర్ణయించు కున్నారు.”
13 నేను దేవుని తరపున మాట్లాడటం పూర్తిచేసిన వెంటనే బెనాయా కుమారుడైన పెలట్యా చని పోయాడు! నేను వెంటనే సాష్టాంగపడి, నా శిరస్సు భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను: “నా ప్రభువైన ఓ యెహోవా, నీవు ఇశ్రాయేలులో మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబోతున్నావు!”
14 కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు:
15 “నరపుత్రుడా, ఈ దేశాన్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. ‘కాని యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది.’ ఇది మాది అని అంటున్నారు.
16 “కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నిపసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను.
17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను!
18 నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ నాశనం చేస్తారు.
19 నేను వారందరినీ చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను వెలికితీసి, దాని స్థానంలో స్పందించే గుండెను అమర్చుతాను.
20 అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.’”
21 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు వారి హృదయాలు ఆ భయంకరమైన, హేయమైన విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభువైన యెహోవా ఆ మాటలు చెప్పాడు.
22 పిమ్మట కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వారిపైన ఉంది.
23 యెహోవా మహిమ గాలిలోకి లేచి యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు తూర్పున వున్న కొండ మీద దేవుడు ఒక్క క్షణం ఆగాడు.
24 పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబలోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చింది. అది నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్ల గొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చింది. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లింది. అవన్నీ నేను దర్శనంలో చూశాను.
25 పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) ప్రజలతో నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని విషయాల గురించీ వారికి చెప్పాను.