వేరే ఆజ్ఞలు
21
(అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు), “ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు:
“హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు. ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు స్వతంత్రుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లయిన వాడైతే, అతడు విడదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు. బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడుదల చేయబడతాడు.”
“అయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకొంటే, ‘నా యజమాని అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను’ అని అతడు తప్పక చెప్పాలి. ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”
“ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని నిర్ణయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు. ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు. ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది.”
10 “ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, మొదటి స్త్రీకి భోజనం, బట్ట, అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి. 11 ఈ మూడింటినీ మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.”
12 “ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ చంపెయ్యాలి. 13 అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు. 14 ఒకడు మరొకని మీద కోపంతో, లేక ద్వేషంతో చంపడానికి పధకం వేస్తే, అలాంటి హంతకుడు శిక్షించబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయాలి.”
15 “ఎవడైనా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే వానిని చర పేయ్యాలి.”
16 “బానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
17 “ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
18 “ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు రాతితో గాని, పిడికిలితో గాని మరొకనిని కొడితే, (అలాంటివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బ తగిలిన వాడు చావకపోతే, అతడ్ని దెబ్బకొట్టి వాణ్ణి చంపకూడదు. 19 అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద ఉండాల్సివస్తే, అతణ్ణి కొట్టినవాడే అతణ్ణి పోషించాలి. అతణ్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి.
20 “కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, హంతకుడు శిక్షించబడాలి. 21 అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”
22 “ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు. 23 అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, 25 వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
26 “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే. 27 ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,
28 “ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు. 29 అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి. 30 అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.
31 “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి. 32 ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”
33 “ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు. 34 ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.
35 “ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది. 36 అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”