సబ్బాతు నియమాలు
35
ఇశ్రాయేలు ప్రజలందర్నీ మోషే సమావేశ పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు చెబతాను.
“పని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే వ్యక్తిని చంపెయ్యాలి. సబ్బాతు రోజున మీరు నివసించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు.”
పవిత్ర గుడారము మరియు వస్తువులు
ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించినది ఇదే. యెహోవా కోసం ప్రత్యేక కానుకలు సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి. నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు. ఎరుపు రంగు వేసిన గొర్రె తోళ్లు, మంచి చర్మాలు, తుమ్మ కర్ర, దీపాల కోసం ఒలీవ నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, సువాసన ధూపంకోసం పరిమళ ద్రవ్యాలు, లేతపచ్చ రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. యాజకులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి.
10 “నైపుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులు ఇవి): 11 పవిత్ర గుడారం, దాని బయటి గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, 12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర 13 బల్ల, దాని కర్రలు, బల్ల మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొట్టె, 14 వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపానికి నూనె, 15 ధూపం వేసేందుకు బలిపీఠం, దాని కర్రలు, అభిషేక తైలం, సువాసన గల ధూపద్రవ్యాలు, పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే తెర, 16 అర్పణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి తెర, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని వస్తువులు, గంగాళం, దాని పీట, 17 ఆవరణపు తెరలు, వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర 18 గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు, 19 పరిశుద్ధ స్థలంలో యాజకులు ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. యాజకుడైన అహరోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.”
ప్రజల మహా గొప్ప అర్పణ
20 అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు. 21 ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ప్రయోగించబడ్డాయి. 22 ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్త్రాలూ తెచ్చారు. పిన్నులు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.
23 నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు. 24 వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు. 25 నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది. 26 సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.
27 పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి. 28 సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.
29 సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.
బెసలేలు, అహోలియాబు
30 అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊర్ కుమారుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. (హోరు కుమారుడు ఊర్). 31 బెసలేలును యెహోవా తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయడానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు. 32 అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు. 33 ప్రశస్తమైన రాళ్లను రత్నాలను చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపని చేసి అన్ని రకాల వస్తువులు తయారు చేయగలడు. 34 ఇతరులకు నేర్పించగల నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడు అహోలియాబు). 35 అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక నైపుణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్లవాని పనులు, లోహపు పనులు వారు చేయగలరు. నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుటా పని వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.