దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు
24
చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు. ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు ఒక్కటే, బానిసలు, యజమానులు ఒక్కటే. ఆడ బానిసలు, యజమానురాండ్రు ఒక్కటే. అమ్మేవారు కొనేవారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు ఒక్కటే. ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు గనుక ఇది జరుగుతుంది. దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.
దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది ఎలా జరిగింది? ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు ప్రజలు విధేయులు కాలేదు. ప్రజలు చాలాకాలం క్రిందట దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అపరాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్దిమంది ప్రజలు మాత్రమే బతుకుతారు.
ద్రాక్ష వల్లులు చస్తున్నాయి. కొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు విచారంగా ఉన్నారు. ప్రజలు వారి ఆనందం ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగిపోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం సమసిపోయింది. ప్రజలు వారి ద్రాక్షరసం తాగేటప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది.
10 “పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరిపోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించబడ్డాయి. 11 ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షరసం కోసం అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. ఆనందం దూరంగా తీసుకుపోబడింది. 12 పట్టణానికి నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా చితుక గొట్టబడ్డాయి.
13 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు.
కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి.
రాజ్యాల మధ్య ఈ దేశానికి గూడ అలానే ఉంటుంది.
14 విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు
యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
15 ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి!
దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి!
యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము.
ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి.
కానీ నేనంటాను: “చాలు,
నాకు సరిపోయింది!
నేను చూస్తున్న సంగతులు భయంకరం.
దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”
17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది.
వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
18 ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు.
వారు భయపడిపోతారు.
కొంతమంది ప్రజలు పారిపోతారు.
కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు
వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు.
కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు.
పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి.
వరదలు మొదలవుతాయి.
భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
19 భూకంపాలు వస్తాయి.
భూమి పగిలి తెరచుకొంటుంది.
20 లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి.
అందుచేత భూమి ఆ భారం కింద పడిపోతుంది.
ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది
తాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది.
భూమి ఇక కొనసాగలేదు.
21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు
పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను
యెహోవా తీర్పు తీరుస్తాడు.
22 ఎందరెందలో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు.
కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు.
వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు.
కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
23 యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు.
పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది.
చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.