యూదాలో అహాజు రాజు అగుట
16
యోతాము కుమారుడైన అహాజు యూదాకు రాజయ్యాడు. రెమల్యా కుమారుడైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న 17వ సంవత్సరమున అది జరిగింది. అహాజు రాజయ్యేనాటికి, అతను 20 యేండ్లవాడు. యోరూషలేములో అహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోవా చేయుమని చెప్పిన పనులు అహాజు చేయలేదు. తన పూర్వికుడైన దావీదు దేవునికి విధేయుడు. కానీ తన పూర్వీకులవలె అహాజు యెహోవాకి విధేయత చూపలేదు. అహాజు ఇశ్రాయేలు రాజులవలె నివసించాడు. అతను తన కుమారుని కూడా అగ్నిలో బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు యెహోవా విడిచి వెళ్లుటకు కారణమైన ఆ జనాంగములు చేసిన భయంకర పాపాలను అతను అనుసరించాడు. అహాజు బలులు అర్పిస్తూ ఉన్నత స్థలాలలో ధూపం వేసాడు; కొండల మీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను వెలిగించాడు.
సిరియా రాజయిన రెజీను రెమల్యా కుమారుడు మరియు ఇశ్రాయేలు రాజయిన పెకహు యెరూషలేముకు ప్రతికులంగా యుద్ధం చేయడానికి వచ్చారు. రెజీను పెకహు కలిసి అహాజుని చుట్టుముట్టారు; కాని ఓడించలేకపోయారు. ఆ సమయంలో సిరియా రాజయిన రెజీను సిరియా కోసం ఏలతును తిరిగి పొందాడు. ఏలతులో నివసించే యూదా వారినందరిని రెజీను తీసుకుపోయాడు. ఏలతులో స్థిరపడిన సిరియనులు నేటికీ అక్కడే నివసిస్తున్నారు.
అష్షూరు రాజయిన తిగ్లత్పిలేసెరు వద్దకు అహాజు దూతలను పంపాడు. సందేశం ఏమనగా: “నేను మీ సేవకుడును. నేను మీకు కుమారునివంటి వాడను. సిరియా రాజు, ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను మీరు కాపాడవలెను. వారు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు.” యెహోవా ఆలయంలోను, రాజభవన నిధులలోను వున్న వెండి బంగారాలను అహాజు తీసుకొని పోయాడు. తర్వాత అహాజు అష్షూరు రాజుకి కానుక పంపాడు. అష్షూరు రాజు అహాజు మాట ఆలకించాడు. అష్షూరు రాజు దమస్కుకు ప్రతికూలంగా యుద్ధానికి పోయాడు. రాజు ఆ నగరాన్ని వశం చేసుకున్నాడు; ప్రజలను బందీలుగా చేసి దమస్కు నుండి కీరుకి తీసుకునిపోయాడు. అతను రెజీనును కూడా చంపివేశాడు.
10 అహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకునేందుకు దమస్కు వెళ్లాడు. దమస్కులో అహాజు బలిపీఠం చూశాడు. అహాజు రాజు దీని నమూనాని పద్దతిని ఊరియా యాజకునికి పంపాడు. 11 తర్వాత యాజకుడయిన ఊరియా దమస్కు నుండి అహాజు రాజు పంపిన నమూనాననుసరించి ఒక బలిపీఠం నిర్మించాడు. దమస్కు నుండి అహాజు రాకకు పూర్వమే ఊరియా యాజకుడు అదే రకమైన బలిపీఠం నిర్మించాడు.
12 దమస్కు నుండి రాజు రాగానే, అతను బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం వద్ద రాజు బలులు అర్పించాడు. 13 బలిపీఠం మీద అహాజు దహన బలులు ధాన్యార్పణలు అర్పించాడు. అతను పానీయ అర్పణలు, సమాధాన బలులు ఈ బలిపీఠం మీద అర్పించాడు.
14 అహాజు ఆలయం ముందు భాగం నుండి యెహోవా సమక్షంలోవున్న కంచు బలిపీఠం తీసుకున్నాడు. ఈ కంచు బలిపీఠం అహాజు బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య వున్నది. తన సొంత బలిపీఠానికి ఉత్తర దిశగా కంచు బలిపీఠం ఉంచాడు. 15 అహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: “ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యార్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన బలులు దహన బలులు మరి ఇతర బలుల నుండి తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలీ. కాని అవసరము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగిస్తాను.” 16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఉరియా యాజకుడు జరిగించాడు.
17 యాజకులు తమ చేతులు కడుగుకొనేందుకు బళ్లనిండుగా ఇత్తడి గంగాళాలు, లోతు పళ్లాలు వున్నవి. అహాజు రాజు ఆ గంగాళాలు, లోతు పళ్లెములు తొలగించి బండ్లని ముక్కలు చేశాడు. కంచు స్తంభాల మీద నున్న పెద్ద తొట్టిని తీసివేశాడు. ఆ పెద్ద తొట్టిని చదును చేయబడిన రాయిపై వుంచాడు. 18 ఆలయంలోని ప్రతి భాగంలో సబ్బాతు సమావేశాల కోసం పనివారు మూయబడిన ఒక ప్రదేశం తయారు చేశారు. అహజు రాజు తన కోసం కప్పియున్న మండపము మరియు వెలుపలి ప్రవేశాన్ని తీసివేశాడు. వాటన్నిటినీ యెహోవా ఆలయంనుంచి అహాజు తీసివేశాడు. అష్షూరు రాజుకోసం అహాజు అవి చేశాడు.
19 అహాజు చేసిన ఆ కార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 20 అహాజు మరణించగా అతను దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు సమాధి చేయబడ్డాడు. అహాజు కుమారుడు హిజ్కియా, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.