అర్తహషస్త రాజు నెహెమ్యాను యెరూషలేముకు పంపటం
2
1 అర్తహషస్త రాజు పాలన ఇరవయ్యవ సంపత్సరం, నీసాను నెలలో, ఎవరో కొంత ద్రాక్షారసం తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి, పరిక్షించి, తర్వాత దాన్ని రాజుకి అందించాను. నేను రాజు సమక్షంలో వున్నప్పుడెప్పుడూ విచారంగా లేను, కాని అప్పుడు విచారంగా వున్నాను.
2 దానితో, రాజు నన్ను, “నీ ఒంట్లో బాగాలేద ఎందుకలా విచారంగా కనిపిస్తున్నావు? నీ గుండెల్లో విచారం గూడు కట్టుకుందన్నట్లు అనిపిస్తోంది” అని ప్రశ్నించారు.
అప్పుడు నేను చాలా భయపడ్డాను.
3 అయితేనేమి, నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి” అని విన్నవించాను.
4 అప్పుడు రాజు, “నీకు నావల్ల ఏ సహాయం కావాలి?” అని నన్ను అడిగారు.
జవాబిచ్చేందుకు ముందు, నేను పరలోక దేవుణ్ణి ప్రార్థించి.
5 రాజుకి ఇలా సమాధానమిచ్చాను. “రాజుకి దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించివుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను అక్కడికి పోయి, ఆ నగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకొంటున్నాను.”
6 అప్పుడు రాణి రాజుగారి పక్కనే కూర్చుని వుంది. రాజు మరియు రాణీ, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” అని అడిగారు.
నన్ను పంపేందుకు రాజుగారు సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకని, నేను తిరిగి వచ్చినప్పుడే అని చెప్పాను.
7 నేను రాజుగారితో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజుగారు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు ఆ పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలునాకు అపసరము.
8 నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ, నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.”
రాజుగారు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చారు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజుగారు ఇవన్నీ చేశారు.
9 సరే, నేను యూఫ్రటిసు నది పశ్చిమ ప్రాంతాల పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజుగారి లేఖలు వారికి యిచ్చాను. రాజుగారు నాకు తోడుగా కొందరు సైనికోద్యోగులను, అశ్విక సైనికులను కూడాపంపారు.
10 నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు ఇద్దరు, సన్బల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. ఇశ్రాయేలు ప్రజలకి తోడ్పడేందుకు ఎవరో వచ్చి నందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్బల్లటు హారోనీయుడు, టోబీయా అమ్మెనీయుడు.
నెహెమ్యా చేత యెరూషలేము గోడల తనిఖీ
11-12 నేను యెరూషలేముకి పోయి, అక్కడ మూడు రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంటతీసుకొని బయల్దేరాను. యెరూషలేముకి నేను ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను స్వారీ చేస్తున్న గుర్రం తప్పనాకు వేరే గుర్రాలేమీ లేవు.
13 చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి దిక్కుకి సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి వున్నాయి.
14 తర్వాత నేను నీటిబుగ్గ ద్వారంవద్దకు, రాజ కోనేరుల దిశగా స్వారీ చేస్తూ పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడి మార్గం నా గుర్రం పోలేనంతటి యిరుకుగా వుండటం గమనించాను.
15 అందుకని నేను చీకట్లో గోడని పరిశీలిస్తూ లోయపైకి పోయాను. చివరికి నేను వెనక్కి తిరిగి, లోయ ద్వారం గుండా లోనికి పోయాను.
16 అధికారులకీ, ఇశ్రాయేలులోని ప్రముఖులకీ నేనెక్కడికి వెళ్లానో తెలియదు. నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదులకి, యాజకులకి, రాజ కుటుంబీకులకి, ఉద్యోగులకి, లేక పని చేయబోయే ఏ యితరులకి నేను అప్పటికింకా ఏమీ చెప్పలేదు.
17 తర్వాత నేను వాళ్లందరికీ యిలా చెప్పాను: “మనకి ఇక్కడున్న ఇబ్బందేమిటో మీరు చూడగలరనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని ద్వారాలు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టెదము. అప్పుడిక మనం ఎప్పటికీ సిగ్గుపడము.”
18 అప్పుడు నేను వాళ్లకి దేవుడు నాపట్ల ఎలాదయ చూపాడో చెప్పాను. రాజుగారు నాతో అన్న మాటలుచెప్పాను. అప్పుడు వాళ్లు, “ఇప్పుడే పని ప్రారంభిద్దాం పదండి!” అన్నారు. దానితో మేమి మంచి పని ప్రారంభించాము.
19 హారోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ ఉద్యోగి టోబీయా, అరబీయుడైన గెషెము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నామన్న విషయం విన్నారు. వాళ్లు మమ్మల్ని, “ఏమిటి మీరు చేస్తున్న పని? రాజుగారి మీదే తిరుగుబాటు చెయ్య బోతున్నారా?” అంటూ చెడు విధంగా ఎగతాళి చేశారు.
20 అయితే, నేను వాళ్లకిలా బదులు చెప్పాను: “పరలోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము ఈ నగరాన్ని తిరిగి నిర్మిస్తున్నాము. ఈ కృషిలో మాకు మీరు సహాయం చెయ్యలేరు. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. ఈ నేలలో కొంచెం కూడా మీకు చెందదు. మీకు యిక్కడ వుండే హక్కు బొత్తిగా లేదు!”