26
పవిత్ర గుడారం
“పది తెరలతో పవిత్ర గుడారం చెయ్యాలి. సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టతో ఈ తెరలు చేయాలి. రెక్కలుగల కెరూబుల చిత్ర పటాలను ఒక నిపుణుడు తెరలమీద కుట్టాలి. తెరలన్నీ ఒకే కొలతలో తయారు చేయాలి. ప్రతి తెరా 14 గజాల పొడవు 2 గజాల వెడల్పు ఉండాలి. తెరలను రెండు భాగాలుగా కుట్టాలి. అయిదు తెరలను ఒక విభాగానికి, అయిదు తెరలను మరో విభాగానికి కలిపి కుట్టాలి. చివరి తెర అంచుకు ఉంగరాలు కుట్టాలి. ఈ ఉంగరాలు చేసేందుకు నీలము గుడ్డ ఉపయోగించాలి. తెరల రెండు విభాగాల కింది అంచులకు ఉంగరాలు ఉండాలి. మొదటి విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు, రెండో విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు ఉండాలి. ఈ ఉంగరాలను జత చేయటానికి 50 బంగారు ఉంగరాలు చెయ్యాలి. పవిత్ర గుడారం అంతా ఒక్కటిగా ఉండటానికి ఇది తెరలన్నింటినీ జత చేస్తుంది.
“తర్వాత పవిత్ర గుడారాన్ని కప్పేందుకు ఇంకో గుడారాన్ని నీవు చెయ్యాలి. ఈ గుడారం చేయటానికి మేక వెంట్రుకలతో చేయబడ్డ 11 తెరలను ఉపయోగించు. ఈ తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి. అవి 15 గజాలు పొడవు, 2 గజాలు వెడల్పు ఉండాలి. అయిదు తెరలను ఒక విభాగంగా కలిపి కుట్టాలి. తర్వాత మిగిలిన ఆరు తెరలను మరో విభాగంగా కలిపి కుట్టాలి. ఆరో తెరను గుడారం ముందటి భాగాన్ని కప్పేందుకు ఉపయోగించాలి. తలుపులా తెరచుకొనేందుకు వీలుగా దీన్ని చుట్టిపెట్టాలి. 10 ఒక భాగంలోని చివరి తెర అంచుకు 50 కొలుకులు తయారు చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. 11 అప్పుడు 50 ఇత్తడి ఉంగరాలు చెయ్యాలి. గుడ్డ ఉంగరాలను జతచేయటానికి ఈ ఇత్తడి ఉంగరాలను ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల తెరలన్నీ కలిసి ఒకే గుడారంగా తయారువుతాయి. 12 ఈ తెరలు పవిత్ర గుడారం కంటె పొడవుగా ఉంటాయి. కనుక తెరల్లో కొంత భాగం గుడారం వెనుకగా వేలాడుతుంటాయి. 13 తెర గుడారం ప్రక్కల్లో వేలాడుతుంటుంది. ఇది గుడారాన్ని భద్రంగా ఉంచుతుంది. 14 పవిత్ర గుడారానికి ఇంకా రెండు పైకప్పులు చేయాలి. ఒకటి ఎర్ర రంగు పూసిన పొట్టేలు చర్మంతో చేయాలి. ఇంకొకటి మేలు రకం తోలుతో చెయ్యాలి.
15 “పవిత్ర గుడారం చట్రానికి ఉపయోగించే పలకలను తుమ్మకర్రతో చెయ్యాలి. 16 చట్రాలు 15 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పు ఉండాలి. 17 ప్రతి చట్రం ఒకేలా ఉండాలి. ప్రతి చట్రానికి పక్క పక్కగా రెండేసి పక్కకర్రలు (దిమ్మలో అమర్చేవి) ఉండాలి. 18 పవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి. 19 ప్రతి చట్రం కింద పెట్టడానికి రెండేసి వెండిదిమ్మలు చేయాలి. కనుక చట్రాలన్నింటికీ 40 వెండిదిమ్మలు నీవు చేయాలి. 20 పవిత్ర గుడారం ఉత్తరదిక్కుకోసం ఇంకా 20 చట్రాలు చెయ్యాలి. 21 అంటే ఒక్కో చట్రానికి రెండేసి చొప్పున చట్రాలకోసం మొత్తం 40 వెండి దిమ్మలు చెయ్యాలి. 22 గుడారం వెనుక పశ్చిమ కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి. 23 మూలల కోసం రెండు చట్రాలు చెయ్యాలి 24 మూలల్లో ఉండే రెండు చట్రాలు జత చేయాలి. రెండుచట్రాలు అడుగు భాగాన జతపర్చబడాలి. పైభాగంలో ఉన్న ఒక ఉంగరం రెండు చట్రాలను జత పరుస్తుంది. 25 కనుక (గుడారం చివరన) మొత్తం ఎనిమిది చట్రాలు ఉంటాయి. ఒక్కో చట్రం కింద రెండు దిమ్మల చొప్పున మొత్తం 16 వెండి దిమ్మలుంటాయి.
26 “పవిత్ర గుడారం చట్రాలకు తుమ్మ కర్రతో అడ్డకమ్ములు చేయాలి. పవిత్ర గుడారం మొదటి ప్రక్కకు అయిదు అడ్డకమ్ములు ఉండాలి. 27 పవిత్ర గుడారం పశ్చిమాన వెనుకవైపు చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. పవిత్ర గుడారం పశ్చిమ దిక్కున చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. (అంటే పవిత్ర గుడారం వెనుక) 28 అయిదు చట్రాలకు మధ్య ఉండే అడ్డకమ్మి పైనుండి కిందికి సగం సగంగా ఉండాలి. ఈ కొననుండి ఆకొన వరకు చట్రాల గుండా ఈ అడ్డకమ్మి దూర్చబడాలి. 29 చట్రాలను బంగారంతో తాపడం చేయాలి. అడ్డకమ్ములను పట్టి ఉంచడానికి చట్రాలకు ఉంగరాలు చెయ్యాలి. 30 నేను నీకు పర్వతం మీద చూపించినట్టే, పవిత్ర గుడారం నిర్మించు.
పవిత్ర గుడారం లోపల
31 “సున్నితమైన వస్త్రంతో గుడారం లోపలి భాగం కోసం ప్రత్యేకమైన ఒక తెరను తయారు చెయ్యాలి. నీలం, ఊదా, ఎరుపు రంగు బట్టతో ఈ తెరను తయారు చేయాలి. కెరూబుల చిత్రపటాలను ఈ బట్టమీద కుట్టాలి. 32 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చెయ్యి. బంగారు కొక్కేల ఆ నాలుగు స్తంభాలకు అమర్చు. స్తంభాలకు బంగారు తాపడం చెయ్యి. స్తంభాల కింద నాలుగు వెండి దిమ్మలు పెట్టు. తర్వాత తెరను బంగారు కొక్కేల మీద వ్రేలాడదీయి. 33 కొక్కేల మీద తెరను వేలాడ దీసిన తరువాత, ఒడంబడిక పెట్టెను తెర వెనుక పెట్టు. పవిత్ర స్థానాన్ని, మహా పవిత్ర స్థానాన్ని, ఈ తెర వేరుచేస్తుంది. 34 మహా పవిత్ర స్థానంలో ఒడంబడిక పెట్టె మీద మూత పెట్టు.
35 “పవిత్ర స్థానంలో నీవు చేసిన బల్లను తెర అవతలి ప్రక్క పెట్టు. పవిత్ర గుడారంలో ఉత్తరంగా బల్ల ఉండాలి. పవిత్ర గుడారంలో దక్షిణంగా దీపం ఉండాలి. ఇది బల్ల ప్రక్క అడ్డంగా ఉండాలి.
పవిత్ర గుడారపు ద్వారం
36 “తర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. తెర చేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నితమైన బట్టను ఉపయోగించు. ఆ బట్టలో చిత్రపటాలను అల్లిక చేయాలి. 37 తలుపుపై ఉండే తెరకు బంగారు కొక్కేలు చేయాలి. బంగారు తాపడం చేయబడ్డ అయిదు తుమ్మకర్ర స్తంభాలు చెయ్యాలి. అయిదు స్తంభాలకూ అయిదు ఇత్తడిదిమ్మలు చేయాలి.