38
దహన బలులకు పీఠం
1 తర్వాత బెసలేలు బలిపీఠం కట్టాడు. ఇది దహన బలులను దహించటానికి ఉపయోగించిన బలిపీఠం. తుమ్మ కర్రతో అతడు బలిపీఠం చేసాడు. బలిపీఠం చతురస్రం, దాని పొడువు ఏడున్నర అడుగులు, వెడల్పు ఏడున్నర అడుగులు, ఎత్తు నాలుగున్నర అడుగులు. 2 ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు చేసాడు. కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు చేసాడు. తర్వాత అతడు దాన్నంతటినీ యిత్తడితో తాపడం చేసాడు. 3 తర్వాత బలిపీఠం మీద ఉపయోగించే పరికరాలు అన్నింటినీ అతడు చేసాడు. బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముల్లు గరిటెలు, నిప్పు పాత్రలు అతడు చేసాడు. 4 తర్వాత అతడు బలిపీఠం కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేసాడు. ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది. బలిపీఠం అడుగున అంచు కింద ఉంచబడింది. అది అడుగు భాగాన కింద నుండి బలిపీఠం లోనికి సగం వరకు వుంది. 5 తర్వాత ఇత్తడి ఉంగరాలు చేసాడు. బలిపీఠాన్ని మోసే కర్రలను పట్టి వుంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించ బడ్డాయి. ఆ ఉంగరాలకు ఇత్తడి జల్లెడ నాలుగు మూలలను అతడు అమర్చాడు. 6 తర్వాత అతడు తుమ్మకర్రతో కర్రలు చేసి, వాటిని యిత్తడితో తాపడం చేసాడు. 7 ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు అతడు. బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించబడ్డాయి. బలిపీఠం చేయడానికి అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు. బలిపీఠం లోపల ఖాళీ గంగాళం వుంది.
8 దాని దిమ్మను అతడు ఇత్తడితో చేసాడు. స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దాలను అతడు ఉపయోగించాడు. సమావేశ గుడార ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు.
పవిత్ర గుడారం చుట్టూ ఆవరణ
9 తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేసాడు. దక్షిణం వైపు తెరల పొడవు 50 గజాలు. 10 దక్షిణం వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. ఆ స్తంభాలు 20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి. 11 ఆవరణ ఉత్తరం వైపుకూడ దక్షిణం వైపులాగే ఉంది. 20 ఇత్తడి దిమ్మల మీద 20 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
12 ఆవరణ పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కెములు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
13 ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 గజాలు వెడల్పు, 14 ప్రవేశానికి ఒక ప్రక్క ఏడున్నర గజాలు పొడవు గల ఒక తెర ఉంది. ఆ తెరకు మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15 ప్రవేశానికి మరో పక్క ఇంకో తెర ఉంది. దాని పొడవు కూడ ఏడున్నర గజాలు. ఆ తెరకు కూడా మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 16 ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి. 17 స్తంభాలకు దిమ్మలు ఇత్తడితో చేయబడ్డాయి. కొక్కెములు, తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు కూడ వెండితో తాపడం చేయబడ్డాయి. ఆవరణలోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డీలతో కలుపబడ్డాయి.
18 నీలం, ఎరుపు ధూమ్రవర్ణం బట్ట, నాణ్యమైన సన్నని నార బట్టతో ఆవరణ ప్రవేశానికి తెర చేయబడింది. నిపుణుడు వీటన్నింటినీ కలిపి కట్టాడు. ఆ తెర 10 గజాలు పొడవు, రెండున్నర గజాలు ఎత్తు ఉంది. ఆవరణలో తెరల వలే అవి కూడ అదే ఎత్తు ఉన్నాయి. 19 ఆ తెర నాలుగు స్తంభాలు, నాలుగు ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది. 20 స్తంభాల మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు, బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
21 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసి పెట్టమని లేవీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు. అహరోను కుమారుడు ఈతామారు ఈ జాబితా బాధ్యత వహించాడు.
22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్నీ యూదా వంశాపు హూరు కుమారుడైన ఊరి కుమారుడు బెసలేలు తయారు చేసాడు. 23 ఇంకా దాను వంశాపు అహీమాసాకీ కుమారుడు అహోలీయాబు అతనికి సహాయం చేసాడు. అహోలీయాబు నిపుణుడు, నమూనాలు గీయగలడు. శ్రేష్ఠమైన నారబట్టలతో నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో బుటా పని చేయగలవాడు అతడు.
24 పవిత్ర గుడారం కోసం రెండు టన్నులకంటే ఎక్కువ బంగారం యెహోవాకు అర్పణగా ఇవ్వబడింది. (ఆలయపు అధికారిక కొలత ప్రకారం ఇది తూచబడింది).
25 ప్రజలు మూడుముప్పావు టన్నులకు మించి వెండిని యిచ్చారు. (ఇది ఆలయపు అధికారిక కొలత ప్రకారం తూచబడింది). 26 ఇరవై సంవత్సరాలు, అంతకు పైబడ్డ మగవాళ్లందరినీ లెక్కించారు. మొత్తం 6,03,550 మంది మగవారున్నారు. వారిలో ప్రతి ఒక్కడు ఒక వెండి బాకా (అరతులం వెండి) పన్ను చెల్లించాలి. (ఒక వెండి బాకా అంటే అధికారిక కొలత ప్రకారం ఒక అరతులం.) 27 అందులో మూడు ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు 100 దిమ్మలు చేసేందుకు, తెరచేసేందుకు వినియోగించబడింది. ఒక్క దిమ్మకు 75 పౌన్ల వెండి వారు ఉపయోగించారు. 28 కొక్కెములు, తెరల కడ్డీలు చేయటానికి, స్తంభాలకు వెండి తాపడం చేయటానికి మరో 50 పౌన్ల వెండి ఉపయోగించబడింది.
29 ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహోవాకు ఇవ్వబడింది. 30 సన్నిధి గుడార ప్రవేశం దగ్గర దిమ్మలు చేయటానికి ఆ ఇత్తడి ఉపయోగించబడింది. బలిపీఠం, ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి ఉపయోగించారు. బలిపీఠం కోసం పరికరాలు, పాత్రలు అన్నీ చేయటానికి కూడా ఇదే ఇత్తడి వాడబడింది. 31 ఆవరణ చుట్టూ తెరల దిమ్మలు చేసేందుకు, ప్రవేశం దగ్గర తెరల దిమ్మలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి వాడబడింది. పవిత్ర గుడారానికి, ఆవరణ చుట్టూ ఉన్న తెరలకూ కావల్సిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడి ఉపయోగించబడింది.