23
యెహోషువ ప్రజలను ప్రోత్సాహించటం
ఇశ్రాయేలీయులకు వారి చుట్టూ ఉండే శత్రువులనుండి యెహోవా శాంతిని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను యెహోవా క్షేమంగా ఉంచాడు. చాల సంవత్సరాలు గడిచాయి, యెహోషువ వృద్దుడయ్యాడు. ఈ సమయంలో ఇశ్రాయేలు నాయకులు, కుటుంబ పెద్దలు న్యాయమూర్తులు అందరినీ యెహోషువ సమావేశపర్చాడు. యెహోషువ ఇలా చెప్పాడు: “నేను చాల ముసలివాడినయ్యాను. మన శత్రువులకు యోహోవా చేసిన వాటిని మీరు చూసారు. మనకు సహాయం చేసేందుకు అయన అలా చేసాడు. మీ దేవుడైన యోహోవా మీ పక్షంగా పోరాడాడు. పశ్చిమాన మహా సముద్రానికి, యోర్దానుకు మధ్యగల దేశమంతా మీ ప్రజలు తీసుకోవచ్చని నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా దానిని స్వాధీనం చేసుకోలేదు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు మీ యెహోవా దేవుడు బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు, అక్కడ నివసిస్తున్న ప్రజలను యెహోవా వెళ్లగొట్టేస్తాడు. మీ దేవుడైన యోహోవా చేసిన వాగ్దానం ఇది.
“యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు. ఇశ్రాయేలు ప్రజలు కానివాళ్లు ఇంకా కొంతమంది మన మధ్య నివసిస్తున్నారు. ఆ ప్రజలు వారి స్వంత దేవుళ్లను ఆరాధిస్తున్నారు. ఆ ప్రజలతో స్నేహం చేయవద్దు. వారి దేవుళ్లను సేవించవద్దు, ఆరాధించవద్దు. మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. అలాగే మీరు చేస్తూ ఉండాలి.
“మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ఆ ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. ఏ రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది. 10 యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. 11 అందుచేత మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూనే ఉండాలి. మీరు సంపూర్ణులుగా అయనను ప్రేమించాలి.
12 “యెహోవా మార్గంనుండి తొలగిపోవద్దు. ఇశ్రాయేలీయులకు చెందని ఏ ఇతరులతో స్నేహం చేయవద్దు. వారి మనుష్యులను ఎవరినీ పెళ్లాడకండి. అయితే మీరే గనుక ఈ మనుష్యులతో స్నేహం చేస్తే 13 మీ శత్రువులను జయించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు సహాయం చేయడు. కనుక ఈ ప్రజలు మీకు ఒక ఉచ్చుగా ఉంటారు. వారు మీ కళ్లలో పొగలా, ధూళిలా మీకు బాధ కలిగిస్తారు. మరియు ఈ మంచిదేశం నుండి మీరు వెళ్లగొట్టబడుతారు. ఇది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం, కానీ మీరు ఈ ఆజ్ఞకు విధేయులు కాకపోతే, దీనిని పోగొట్టు కొంటారు.
14 “ఇది దాదాపు నేను చనిపోవాల్సిన సమయం యెహోవా మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసాడని మీకు తెలుసు, మీరు వాస్తవంగా నమ్ముతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ ఆయన తప్పలేదని మీకు తెలుసు. మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమూ యెహోవా నెరవేర్చాడు. 15 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ప్రతి మంచి వాగ్దానం నిజంగా నెరవేరింది. అయితే అదే విధంగా యెహోవా తన ఇతర వాగ్దానాలను కూడ నెరవేరుస్తాడు. మీరు తప్పు చేస్తే మీకు కీడు కలుగుతుందని ఆయన వాగ్దానం చేసాడు. ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి బలవంతంగా మిమ్మల్ని వెళ్లగొట్టేస్తానని ఆయన వాగ్దానం చేసాడు. 16 మీ దేవుడైన యోహోవాతో మీరు చేసిన ఒడంబడికను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. మీరు వెళ్లి ఇతర దేవుళ్లకు పూజిస్తే మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.”