౪
ఆదర్శ పూర్వకమైన నడత. విశ్వాసి నిరీక్షణ
౧ చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు. ౨ మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీ జీవిత విధానం ఎలా ఉండాలో మేము మీకు నేర్పించాము. మీరూ ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము. ౩ మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.
౪ మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా ౫ పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. ౬ ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. ౭ పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
౮ కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు. ౯ సోదరుల మధ్య ఉండవలసిన ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. ౧౦ అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
౧౧-౧౨ సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.
మరణించిన వారి విషయం, క్రీస్తు రాక
౧౩ సోదరులారా, భవిష్యత్తుపట్ల ఎలాటి ఆశాభావం లేని ఇతరుల్లాగా కన్నుమూసిన వారిని గూర్చి మీరు విలపించకూడదు. కన్నుమూసిన వారిని గూర్చి మీకు తెలియక పోవడం మాకు ఇష్టం లేదు. ౧౪ యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
౧౫ మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంతవరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. ౧౬ ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయినవారు మొదటగా లేస్తారు. ౧౭ ఆ తరవాత బ్రతికి ఉండే మనల్ని కూడా వారితో కూడా ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
౧౮ కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.