౮
౧ ఆ రోజు అహష్వేరోషు రాజు యూదుల శత్రువు హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. మొర్దెకైతో తన బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు తెలియజేసింది. ౨ అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలోనుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది.
౩ ఎస్తేరు రాజు పాదాలపై పడి విన్నపం చేస్తూ “అగగు వంశీకుడు హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన కార్యాన్ని రద్దు చేయండి” అని కన్నీటితో అతణ్ణి వేడుకుంది. ౪ రాజు తన బంగారు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ౫ ఎస్తేరు రాజు ముందు నిలబడి “రాజైన మీకు అంగీకారం అయితే, మీ అనుగ్రహం నాపై ఉంటే, ఈ సంగతి మీకు సమంజసంగా అనిపిస్తే, నేనంటే మీకు ఇష్టమైతే, హమ్మేదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామాను రాయించిన శాసనాలు అమలు కాకుండా వాటి రద్దుకు ఆజ్ఞ ఇవ్వండి. ౬ నా స్వజనం మీదికి రాబోతున్న కీడును, నా వంశ నాశనాన్ని చూసి నేనెలా సహించ గలను” అని మనవి చేసింది.
౭ అహష్వేరోషు రాజు రాణి అయిన ఎస్తేరుకు, మొర్దెకైకి ఇలా చెప్పాడు. “హామాను ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు యూదులను హతమార్చడానికి ప్రయత్నించినందు వల్ల అతడు ఉరికొయ్య మీద వేలాడి చనిపోయాడు. ౮ అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.”
౯ సీవాను అనే మూడో నెలలో ఇరవై మూడో రోజున రాజుగారి లేఖికులను పిలిచారు. మొర్దెకై ఆజ్ఞాపించినట్టు యూదులకు, ఇండియా నుండి ఇతియోపియా వరకూ విస్తరించిన 127 సంస్థానాల్లోని అధిపతులకు, అధికారులకు, వివిధ సంస్థానాలకు వాటి లిపిలో, వాటి భాషల్లో శాసనాలు రాశారు. ౧౦ మొర్దెకై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై, అంటే రాచకార్యాలకు వినియోగించే మేలు జాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు. ౧౧ “రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో ఒక్క రోజునే అంటే అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన అన్ని పట్టణాల్లో నివసించే యూదులు సమకూడాలి. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు అన్ని చోట్లా తమకు విరోధులైన వారి సైనికులందరిని, బాలలను, స్త్రీలను కూడా, హతం చేసి, సర్వనాశనం చెయ్యాలి. ౧౨ వారి సొత్తు అంతటినీ కొల్లగొట్టాలి, అని రాజు యూదులకు ఆజ్ఞాపించాడు” అని దానిలో రాశారు.
౧౩ ఈ శాసనాల ప్రతులు రాయించి అన్ని సంస్థానాల ప్రజానీకానికి పంపించాలని, యూదులు తమ శత్రువులపై పగ తీర్చుకొనేందుకు ఒకానొక రోజున సిద్ధంగా ఉండాలనీ ఆజ్ఞ జారీ అయింది. ౧౪ రాచ కార్యాల కోసం వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచె వార్తాహరులు రాజాజ్ఞ పొంది అతివేగంగా బయలుదేరారు. ఆ తాకీదును షూషను కోటలో కూడా ఇచ్చారు.
౧౫ అప్పుడు మొర్దెకై నేరేడు, తెలుపు వర్ణాలు గల రాజవస్త్రం, పెద్ద స్వర్ణ కిరీటం, శ్రేష్ఠమైన నారతో చేసిన ఊదా రంగు బట్టలు ధరించి రాజు సముఖం నుండి బయలుదేరాడు. ఈ కారణంగా షూషను నగరంలో సంబరం కలిగింది. ౧౬ యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. ౧౭ రాజు చేసిన తీర్మానం, అతని చట్టం అందిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో యూదులకు ఆనందం, సంతోషం కలిగాయి. వారంతా పండగ చేసుకున్నారు. అందరికీ యూదులంటే భయం వేసింది. కాబట్టి చాలామంది యూదులయ్యారు.