౨
౧ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు చేతిలో కొలనూలు పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. ౨ “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అతణ్ణి అడిగాను. అతడు “యెరూషలేము పట్టణం పొడవు, వెడల్పు ఎంత ఉందో చూసి కొలవడానికి వెళ్తున్నాను” అని చెప్పాడు. ౩ అప్పుడు నాతో మాట్లాడిన దూత బయలుదేరుతున్నప్పుడు మరో దూత అతనికి ఎదురు వచ్చాడు.
౪ ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు. ౫ యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను ఆ పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను. ౬ ఆకాశంలో నాలుగు దిక్కులకు వీచే గాలిలాగా మీరు చెదిరిపోయేలా చేశాను. ఉత్తర దేశాల్లో ఉన్న మీరంతా తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు.
౭ సీయోను ప్రజలారా, బబులోను దేశంలో నివసిస్తున్న మీరు అక్కడ నుండి తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు. ౮ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మిమ్మల్ని దోచుకొన్న ఇతర దేశాల ప్రజల దగ్గరికి ఆయన నన్ను పంపించాడు. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే వాడు యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే. అందువల్ల ఆయనకు ఘనత కలిగేలా, ౯ నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారిని వారి దాసులు దోచుకుంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపించాడని మీరు తెలుసుకుంటారు.
౧౦ యెహోవా ఇలా అంటున్నాడు, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. సంతోష గీతాలు ఆలపించండి. ౧౧ ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. ౧౨ ప్రతిష్ఠితమైన దేశంలో యెహోవా యూదాను తన సొత్తుగా సొంతం చేసుకుంటాడు. ఆయన యెరూషలేమును మళ్ళీ కోరుకుంటున్నాడు. ౧౩ సమస్తమైన ప్రజలారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నాడు. ఆయన ఎదుట మౌనంగా నిలబడి ఉండండి.